సుంకాల మోత.. ధరలో కోత!
నరసాపురం, మొగల్తూరు, అత్తిలి గ్రామీణ, న్యూస్టుడే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకం ఆక్వా రంగానికి పెను గండంగా మారింది. పశ్చిమలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో రైతులు వెనామీ రొయ్య సాగు చేస్తూ ఏటా సుమారు రూ.5 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తి చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు రొయ్యల ధరపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో మే, జూన్ నెలల్లో అత్యధిక స్థాయిలో రొయ్యల దిగుబడి ఉంటుంది. ఆ సమయంలో ఎగుమతి దారులు భారీ స్థాయిలో సరకు కొనుగోలు చేసి శీతల గిడ్డంగుల్లో భద్రపరిచారు. వర్షాకాలం ప్రారంభమయ్యాక చెరువుల్లో రొయ్యలకు తెల్లమచ్చ, ఇతర వ్యాధులు సోకి మృత్యువాత పడుతున్నాయి. దీంతో తగినంత సరకు లేక ఎగుమతి దారులు ఇటీవల వరకు 100 కౌంటు రొయ్యలకు కిలోకు గరిష్ఠంగా రూ.270 చొప్పున చెల్లించారు. ఇప్పుడు ట్రంప్ సుంకాల ప్రభావంతో కిలోకు రూ.50 వరకు ధరలో కోత విధించారు. సుంకాల ప్రభావం తొలగకపోతే ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
అమెరికాకే ఎక్కువ.. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 10 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా.. సింహభాగం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. దీనిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల వాటానే ఎక్కువ. అమెరికా సుంకాలు, ధరల తగ్గుదల ప్రభావం తాత్కాలికమేనని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయని ఆక్వారంగ నిపుణులు చెబుతున్నారు.
ఆందోళన వద్దు..
- తోట జగదీశ్, జాతీయ కమిటీ సభ్యుడు, రొయ్యల ఎగమతిదారుల సంఘం
గతంలో అమెరికా సుంకాల ప్రభావం చూపకుండా అక్కడి కొనుగోలుదారులు భరించేలా ప్రభుత్వం కృషి చేసి సఫలమైంది. ప్రస్తుతం 50 శాతం సుంకాల విషయంలోనూ ప్రభుత్వం అన్ని
ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషిస్తోంది. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.