మత్స్య ఉత్పత్తుల ద్వారా కోవిడ్ – 19 వ్యాప్తి చెందదని పరిశోధనల ద్వారాఇప్పటికే తేలిందని , జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన స్ధానిక రిమ్స్ లోని జిల్లా మత్స్య శాఖ కార్యాలయం లోని ఆయన చాంబర్ లో బుధవారం ముఖ్యమైన ఆక్వా రైతులు ,ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగు చేసిన రొయ్యలను రైతులు కరోనా తాకిడికి ధరలు ఉండవని తెగనమ్ముకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని రైతులు నష్టపోవద్దని సూచించారు. ఆహార సంబంధమైన అంశాల్లో కరోనాకు సంబంధిచిన వివరాలను వెల్లడించారు. మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవటం ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందదని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ జిజె. ప్రమోద్ మల్లిక్ జిల్లాలకు ఉత్తర్వులు పంపారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య , కుటుంబ సంక్షేమమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారతఆహార పరిరక్షణ, ప్రమాణాల సంస్ధ పరిశోధనల ద్వారా వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వ మత్స్యశాఖ , పశుసంవర్ధక , డైరీమంత్రిత్వ శాఖ కూడా దేశంలో కరోనా వైరస్ పరిస్ధితిపై అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్ధ శాస్త్రీయ అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని వెల్లడించారు. ప్రపంచములోని ఏ నివేదిక ప్రకారం కూడా కరోనా వైరస్ మత్స్య ఉత్పత్తుల నుంచి కానీ లేదా వాటి విలువ ఆధారిత ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవటం వలన కానీ వ్యాప్తి చెందదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపిందని వెల్లడీంచారు. అందులో భాగంగానే రేట్లు ఇంకా తగ్గుతాయన్న భయంతో రొయ్యలను అమ్ముకోవద్దన్నారు..
అపోహలతో మోసపోవద్దు...
తెల్ల మచ్చలు , విబ్రియో లాంటి వ్యాధులు వచ్చినప్పడు మాత్రమే మార్కెట్ ను బట్టి విక్రయించుకోవాలని కూడా సూచించారు. జిల్లాలో కేవలం 1500 హెక్టార్లలో మాత్రమే రొయ్యల సాగు చేశారని వివరించారు. అందరూ ఒకేసారి రొయ్యలను పట్టటం వలన మార్కెట్లో ధరలు తగ్గయే తప్ప మరొక కారణం కాదన్నారు. చైనాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలకు ఎగుమతులు కొంత తగ్గినమాట వాస్తవమేనని, అందువల్ల కొంత మేర ధరలు తగ్గాయే తప్ప కరోనా తీవ్రత వలన కాదన్నారు. మున్నంగి ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంటు యజమాని మున్నంగి రాజశేఖర్ ప్రస్తుతం మార్కెట్లోఉన్న పరిస్ధితిని వివరించారు.సమీక్షలో మత్స్యశాఖ ఒంగోలు ఏడీ ఏ ఉషాకిరణ్ , చీరల ఏడి రంగనాధ్ బాబు , నాక్సా ఫీల్డ్ మేనేజర్ భరత్ రాజు, ఆక్వా రైతులు టంగుటూరు శానం వెంకట్రావు, ఆలకూరపాడు చైతన్య ప్రశాంత్ , కొత్తపట్నం కె. సుబ్బారెడ్డి తోపాటు పలువురు పాల్గోన్నారు..
source : sakshi