ఈనాడు డిజిటల్, భీమవరం, మొగల్తూరు, న్యూస్టుడే: అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా మొన్నటి వరకు ధరల దిగులుతో ఇబ్బందిపడ్డ రొయ్య రైతులు.. ఇప్పుడేమో వ్యాధుల భయంతో సతమతమవుతున్నారు. చెరువులో రొయ్య చేతికొస్తుందో లేదో అని వణికిపోతున్నారు. కొద్ది రోజులుగా తెల్లమచ్చ (వైట్స్పాట్ సిండ్రోమ్) వ్యాధి ప్రబలుతోంది. ఈ హెచ్పీ (ఎంటెరో సైటోజూన్ హెపటోపెనాయ్) వ్యాధి తీవ్రత కూడా చెరువుల్లో అధికంగా ఉంది. రెండూ కలిసి రొయ్య రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, వర్షాలు, పీహెచ్ స్థాయిలో మార్పులు కూడా అక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
భారీగా నష్టం
రాష్ట్రవ్యాప్తంగా 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. రైతులు ఎకరాకు రూ. 4లక్షల నుంచి రూ.5లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్నారు. రొయ్యలను తెల్లమచ్చ, ఈ హెచ్పీ ఆశిస్తే.. రైతులు నిండా మునగడమే. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, భీమవరం, ఉండి, మొగల్తూరు, నరసాపురం, గణపవరం, ఏలూరు జిల్లాలో ఏలూరు, కైకలూరు, కృష్ణా జిల్లా గుడివాడ, నందివాడ ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. పిల్ల రొయ్య నుంచి పట్టుబడికి సిద్ధంగా ఉన్న వాటి వరకు వైరస్ బారిన పడుతున్నాయి. 'మూడెకరాల చెరువును లీజుకు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాను. కనీసం 100 కౌంటు రాలేదు. రొయ్యల ఎదుగుదల లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం' అని మొగల్తూరుకు చెందిన ఎ. సత్యనారాయణ వాపోయారు.
అడిగిన ధరకు ఇచ్చేయడమే
వ్యాధి సోకిన ప్రాంతాల్లో వెంటనే పట్టుబడి చేయకపోతే.. ఆరోగ్యకరమైన రొయ్యలు కూడా చేతికి రావు. దీంతో వ్యాపారులు ధర తగ్గించి అడుగుతున్నారు. రైతులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అడిగిన ధరకు ఇచ్చేస్తున్నారు. 'వాతావరణ మార్పులతో అయిదెకరాల రొయ్యల చెరువులో అప్పటికప్పుడు పట్టుబడి చేశాం. 130 కౌంటుతో 2 టన్నుల ఉత్పత్తి రావడంతో ఎకరాకు సగటున రూ. లక్ష చొప్పున నష్టం వచ్చింది' అని నరసాపురానికి చెందిన సూర్యనారాయణ వాపోయారు. బ్లాక్గరక్కూ.. ధరల్లో కోత
ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బ్లాక్ టైగర్ రొయ్య సాగు పెరిగింది. దీనికి కిలోకు రూ.60 తగ్గించారు. 20 కౌంట్ రూ.680 నుంచి రూ. 620 చేశారు. 30 కౌంట్ రూ.570 నుంచి రూ.510... 40 కౌంట్ రూ.480 నుంచి రూ.420కి తగ్గించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.