టంగుటూరు :కరోనా అందరికి కష్టాలు తెచ్చిపెడుతోంది . మూడేళ్లు నుంచి వాతావరణం అనుకూలించక ఆక్వా రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు . దీనికి తోడు వ్యాధుల సమస్యతో దిగుబడి సైతం అంతంత మాత్రమే ఉంటోంది .వైట్ గట్ వైట్ పీసెస్ వంటి వైరస్ ల విజృంభణతో జిల్లాలోని వెనామీ రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు . దింతో గత సీజన్ లో కూడా పంట సాగు చేయకుండా అనుకూల సమయమైన జులై నెలలోని పంటపైనే ఆశలు పెట్టుకున్నారు . ప్రస్తుత పరిస్థితుల్లో హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి తగ్గిపోవడంతో సీడ్ ధర పెంచారు .దింతో విత్తనం దొరక్క చాలా మంది రైతులు సాగుకు దూరమవుతున్నారు .
మూడేళ్లు గా ఇబ్బందులే ..
జిల్లాలో కోస్తా తీరప్రాంత మండలాల్లో నాలుగువేల మంది రైతులు సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు . అందులో 95 శాతం వెనామీ ఉంటుంది .అయిదేళ్ల క్రితం ఆక్వా సాగు పూర్తి అనుకూల వాతావరణంలో రైతులు లాభాలు పొందారు . మూడేళ్ళ నుంచి రొయ్యలకు వైరస్ సోకి నష్టాలు మూటగట్టుకుంటున్నారు . ఏడాది నుంచి చెరువులను ఖాళీగా ఉంచి , ఇటీవల వర్షాలు పడటంతో చెరువుల్లో రొయ్య పిల్లలను వదిలేందుకు సిద్దమవుతుండగా హేచరీల సీడ్ ధరలను రెట్టింపు చేయడంతో దిక్కుతోచని పరిస్దితి రెండు నెలల క్రితం 20 పైసలు ఉన్న సీడ్ ధర ప్రస్తుతం 45 పైసలకు చేరడంతో ఒక ఎకరానికి వచ్చి రైతుపై అదనంగా రూ .37 వేల భారం పడుతోంది . కరోనా వల్ల ఎగుమతులు నిలిచిపోవడం , రొయ్యల్లో నిషేధిత అవశేషాలు , యాంటీబయోటిక్స్ ఉన్నాయని కంటైనర్లు యూరప్ దేశాల నుంచి వెనక్కి రావడంతో రైతులు నష్టపోయారు .
పతనమవుతున్న ధరలు
సీడ్ దొరక్క సాగుదారుల ఇబ్బందులు పడుతుంటే .. మరో వైపు నెల వ్యవధిలో టన్నుకు రూ .40 వేలు తగ్గింది . నెల రోజుల క్రితం 100 కౌంటు ధర రూ . 250 పలకగా , ప్రస్తుత్తం రూ .210 కి పడిపోయింది . టన్నుకు రూ .40 వేలు తగ్గడంతో పంట చేతికొచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు .అలాగే జిల్లాలో 28 హేచరీలు ఉన్నాయి. హేచరీల్లో సీడ్ ఉత్పత్తి చేయాలంటే సముద్రపు నీటిలో లవణ శాతం 30 శాతానికి పైగా ఉండాలి . ప్రస్తుతం 25 శాతానికి పడిపోయింది . దింతో పిల్లల ఉత్పత్తికి ఇబ్బందికర పరిస్దితులు ఏర్పడ్డాయి . వర్షాకాలం వల్ల సముద్రం నీటిలో ఉప్పు శాతం తగ్గడంతో ఆ ప్రభావం హేచరీల మీద పడింది . ఎర్రలు దొరకడం కూడా ఇబ్బందిగా మారింది . గోదావరి , కృష్టా జిల్లాలో సాగు గణనీయంగా పెరగడంతో వెనామీ రొయ్య పిల్ల ధర పెరిగిందని రైతులు చెబుతున్నారు .
source : eenadu