మీసం మెలేస్తున్న రొయ్య
నిడదవోలు, న్యూస్టుడే: సిరుల పంటగా పేరొందిన రొయ్యల సాగు చేపట్టిన రైతులు గత కొంతకాలంగా అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారు. గతంలో అమెరికా ఆంక్షలతో ధర పడిపోయింది. అనంతరం నిబంధనల సడలింపుతో కొద్దికొద్దిగా ధర పెరిగింది. అయినా రైతులకు పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర దక్కలేదు. ఇటీవల ప్రతికూల పరిస్థితి కారణంగా అప్పటికప్పుడు పట్టుబడి పట్టి వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. గత నెలలో రూ. 220 పలికిన వంద కౌంట్ ధర ప్రస్తుతం రూ.360కు చేరింది. 30 -కౌంట్ గతేడాది డిసెంబరు 21న రూ.270 ఉంటే గత నెల రూ.220, ప్రస్తుతం రూ.260కు చేరింది. 40 కౌంట్ ఈ ఏడాది ఏప్రిల్లో రూ.345 వరకు పలికింది. ప్రస్తుతం చాలా చోట్ల పంట లేదు. ఇప్పుడిప్పుడే రైతులు పంట ప్రారంభంలో ఉన్నారు. ఇది చేతికి రావడానికి మూడు నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం పంట లేకపోవడంతో ఎగుమతికి యూఏఈ, కువైట్, థాయ్లాండ్, సౌదీ, చైనా దేశాలకు చిన్నకౌంట్లకు ఆర్డర్లు రావడంతో ధర పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 15 శాతం చెరువుల్లో మాత్రం పంట ఉంది. 85 శాతం చెరువుల్లో చాలా మంది రైతులు ఇప్పుడిప్పుడే పంట వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపలు, రొయ్యలు 2.80 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీనిలో 80 వేల ఎకరాల్లో రొయ్య పంట ఉంది.