ఇదేమి కాలం'రొయ్యో'!
కలిదిండి, మండవల్లి, న్యూస్టుడే: కలిదిండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కోలా రాజా 20 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. గతేడాది ప్రథమార్థంలో ఖర్చులు పోను ఎకరాకు లక్ష రూపాయలు మిగిలాయి. ఈ ఏడాది తొలి ఆర్నెళ్లలో ఎకరాకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
రొయ్య రైతులు కష్టాలకు ఎదురీదుతున్నారు. ఆక్వా రంగానికి ఈ ఏడాది ప్రథమార్ధం ఏ మాత్రం కలసి రాలేదు. 2024తో పోల్చితే.. 2025లో తొలి ఆర్నెళ్లు నష్టాలు చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం వాతావరణం.. వ్యాధుల బెడద.. ధరల పతనం. ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 70 శాతం రైతులు నష్టపోయారు.
గతం ఘనం.. గత సంవత్సరం రొయ్యల రైతులకు స్వర్ణయుగంగా మారింది. సగటున ఏడాదిలో 260 రోజులు పొడి వాతావరణం ఉంది. 2023 నవంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు వేడితో కూడిన వాతావరణం ఉండటంతో అక్వా రంగానికి అనుకూలంగా మారింది. దీంతో పెద్దఎత్తున రైతులు నష్టాల నుంచి లాభాల వైపునకు అడుగులు వేశారు.
యాజమాన్య పద్ధతులే రక్ష.. మండు వేసవిలోనూ ఆకస్మికంగా వాతావరణం చల్లబడిపోవడం, ఎడతెరిపి లేని వర్షాలు చేపలు, రొయ్యల సాగుకు ప్రతికూలంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరకును రక్షించుకోవడానికి అనువైన యాజమాన్య పద్ధతులపై సాగుదారులకు మరింత అవగాహన కల్పిస్తామని మత్స్యశాఖ ఏడీ రాజ్కుమార్ తెలిపారు.
మే నెలలో వర్షాలు.. 125 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ నివేదిక వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ వాతావరణం రైతులకు పూర్తిగా సహకరించలేదు. మే నెలలో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రాణవాయువు సమస్య ఏర్పడి చేపలు, రొయ్యలు మృత్యువాత పడ్డాయి. దీంతోపాటు అధిక సాంద్రతలో సాగు చేపట్టడం, నీరు, మేత యాజమాన్యంపై సరైన అవగాహన లేకుండా సాగు చేయడం, రొయ్య పిల్లల ఎంపికలో అజాగ్రత్త వల్ల రొయ్యలు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేకపోయాయి.