సాక్షి, అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన రేట్లకే ఆక్వా ఉత్పత్తులు అమ్ముడు పోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వాటికి సంబంధించి లేబర్ సమస్యతోపాటు ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతు తాను కనీస రేటుకు అమ్ముకోలేకపోతున్నానన్న మాట రాకూడదని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, వాటి ధరలు, మార్కెటింగ్‌పై ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (అధిక ధరలకు అమ్మితే... శిక్ష తప్పదు: సీఎం జగన్)
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆక్వా పంటకు కనీస గిట్టుబాటు ధరలు రావాలని ఆదేశించారు. ఎంపెడాలో చెప్పిన రేట్లకు కొనుగోలు చేయడానికి వాళ్లు ముందుకు రాకపోతే మీ ప్రత్యేక అధికారాలను వాడాలని కలెక్టర్లకు సూచించారు. జాతీయ విపత్తు సమయంలో కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైతే ఆ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడవద్దని సూచించారు. ముందుగా రైతుల దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసి వెంటనే ప్రాసెసింగ్ చేయాలని, అనంతరం మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని తెలిపారు. ఒకవేళ ప్రాసెసింగ్ యూనిట్లు వెనుకడుగు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎక్స్‌పోర్ట్ మార్కెటింగ్ వాళ్లతో మాట్లాడి వెంటనే ఎగుమతి అయ్యేలా చూడాలన్నారు. ప్రతిరోజు నిర్దిష్ట సమయం కేటాయించుని వ్యవసాయం, ఆక్వాకు సంబంధించిన పరిస్థితుల గురించి నిరంతరం సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. దీనికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అందుబాటులో ఉండి సమీక్షిస్తారని పేర్కొన్నారు.