సముద్ర ఆహార ఎగుమతులు 3 రెట్లు పెరిగే వీలు
అహ్మదాబాద్: భారత్-యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. మత్స్య ఉత్పత్తులపై సుంకాలు పరిహరించిన నేపథ్యంలో, రానున్న సంవత్సరాల్లో యూకేకు భారత్ నుంచి ఎగుమతులు 3 రెట్లు పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రూ.1,000 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులు యూకేకు ఎగుమతి అవుతుండగా, 3 సంవత్సరాల్లో ఈ విలువ రూ.3,000 కోట్లకు చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2,300 కిలోమీటర్ల సముద్రతీరం కలిగిన గుజరాత్, దాదాపు 1,000 కిలోమీటర్ల తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల వారికి మేలు కలుగుతుందని పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు మనదేశం నుంచి ఎగుమతి అవుతున్న చేపలు, రొయ్యల పైన యూకే 8.9% సుంకం విధిస్తున్నట్లు సీఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఈఏఐ) మాజీ అధ్యక్షుడు పీయూష్ ఫోఫాండి తెలిపారు. ఇకపై ఇది సున్నా కానుంది. యూకే ఏటా దిగుమతి చేసుకుంటున్న 5.4 బిలియన్ డాలర్ల (రూ.47,000 కోట్ల) విలువైన మత్స్య ఉత్పత్తుల్లో మనదేశ వాటా 2.2 శాతమే. ఇప్పుడు సుంకాలు లేనందున, మన ఉత్పత్తుల ధరలు అక్కడ తగ్గడం కలిసి రానుంది.
• మన మత్స్య ఎగుమతుల్లో 70% వాటా రొయ్యలదే. ప్రస్తుతం అమెరికా, ఇతర మార్కెట్లలో వీటికి సమస్యలు ఎదురవుతున్నాయి.