ఆంద్రప్రదేశ్ రెండెంకెల వృద్ధి రేటు సాధనలో మత్స్య సంపద పెంపునకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ,, చేపల పెంపకంలో స్వయం సమృద్ధి పై దృష్టి కేంద్రీకరించింది. నీటివనరుల్లో చేపల పెంపకం కోసం ఏటా టెండర్లు పిలిచి ప్రైవేటు హేచరీల నుంచి చేపపిల్లలను కొనే విధానానికి స్వస్తి పలికి, కొత్త విధానాన్ని తెచ్చింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలోనే చేపపిల్లల పెంపకానికి చర్యలు చేపడుతుంది. ఈ విధానంలో చేపల పెంపకానికి గుర్తించిన జలవనరుల్లో నిర్ధేశిత ప్రాంతంలో వలలు అమర్చి , అందులో పిల్లలను ఉంచి , దాదాపు నెలపాటు పెంచుతారు. ఆ తర్వాత వలలను తొలగిస్తారు. రాష్ట్రంలో చేపపిల్లల పెంపకానికి ఈ కేజ్ కల్చర్ విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారి. మత్స్య శాఖ నర్సరీల్లో,నదులు,జలాశయాలు ,చెరువులు ,కుంటల్లో వలలు కట్టి , చేపపిల్లలను పెంచేందుకు టెండర్ ద్వారా చిన్నచేపపిల్లలను అధికారులు సేకరిస్తున్నారు. వెయ్యేసి చిన్న పిల్లలున్న సంచులను కొంటున్నారు. బొచ్చ రకమైతే రూ. 75, రాగండి రకమైతే రూ.50 , మోసు రకమైతే రూ.45 చొప్పున ఈ సంచులను టెండరు ద్వారా సేకరిస్తున్నారు. మత్స్య శాఖ హేచరీల్లోఅందుబాటులో లేకపోతేనే ప్రైవేట్ హేచరీల నుంచి కొంటున్నారు. పాత విధానంలో ఒక్కొక్క చేపపిల్లకు సగటున రూపాయి వెచ్చించేవారు. తాజా విధానంలో పెట్టుబడి వ్యయం భారీగా తగ్గుతోంది. క్షేత్ర స్ధాయిలో చేపపిల్లల పెంపకానికి స్ధానిక మత్స్య కారుల సేవలను ఓ నెలపాటు ఉపయోగించుకుంటారు. అందుకు వారికి కూలీ చెల్లిస్తారు. చేపపిల్లలను స్ధానిక నీటివనరుల్లో వదలడం వల్ల అవి పెరిగాక అక్కడి మత్స్యకారులకే ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. ఈ విధానం అమలుకు రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలకు జిల్లాకు రూ.38 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే ప్రతి జిల్లాకు రూ.10 లక్షల విడుదల చేసింది. ఈ విధానంతో దళారుల ప్రమేయాన్ని నివారించడం,ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడం , మత్స్యశాఖ వనరులను సమర్ధవంతంగా ఉపయోగించడం సాధ్యమవుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
source : eenadu