భీమవరం : రొయ్యల సాగులో వినియోగిస్తున్న యాంటీ బయోటిక్స్ మందులు అటు రైతులతో పాటు ఎగుమతిదారులనూ కలవర పెడుతున్నాయి. వీటి అవశేషాలు ఉన్నట్టు తేలడంతో గత 20 నెలల్లో భారత్ కు 48 రొయ్యల కంటైనర్లు తిరిగి వచ్చాయి. ఆదివారం నాడిక్కడ విలేకర్ల సమావేశంలో అఖిల భారత ఆక్వా ఎగుమతి దారుల సంఘం మాజీ చైర్మన్ , ఆనంద గ్రూప్ చైర్మన్ యు.కె విశ్వనాధరాజు ఈ విషయం చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ప్రతిష్ట దిగజారకూడదంటే రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీలు , పెంచే రైతులు , మేత ఉత్పత్తి చేసే కంపెనీలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడీకి ఒక నివేదిక సమర్పిస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ దే పెద్ద వాటా...
భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 72 శాతం ఆంద్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. గత మూడేళ్లలోనే రాష్ట్రం నుంచి రొయ్యల ఎగుమతులు 42 శాతం పెరిగాయి. మన రొయ్యల్లో 70 శాతం అమెరికా , 30 శాతం యూరప్ దేశాలకు ఎగుమతి అవుతాయి . ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని యాంటీబయోటిక్ అవశేషాలతో ఎగుమతులకు అవరోధం కలగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని విశ్వనాధరాజు కోరారు.వ్యాధుల నివారణకు రైతులకు తెలిసో, తెలియకోయాంటీబయోటిక్స్ వాడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసేదశలో కూడా కొంత మంది ప్రభుత్వ అనుమతి లేకుండా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు.
పిల్ల దశలోనే వాడకం : పిల్ల దశలోనే రొయ్యల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పెఅభుత్వ రొయ్య , చేప పిల్లల అధారిటీని ఏర్పాటూ చేస్తే బాగుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రైతులనుంచి రొయ్యలు కొనేటప్పుడు యాంటీబయోటిక్స్ మందులు వాడలేదమీ హామీ పత్రం తీసుకుంటే బాగుంటుందని వాదన వినిపిస్తోంది. దాదాపు 18 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నా ఇప్పటికీ కొంత మంది రైతులు ఈ సమస్యకు కారణమవుతున్నారని విశ్వనాధ రాజు చెప్పారు.
Source : Andhra jyothi