వెనామీ రొయ్యలను సగు చేస్తున్న రైతన్నలను నష్టాల సునామీ ముంచెత్తుతోంది. టైగర్ రొయ్యలను తలదన్ని వచ్చిన వనామీ రొయ్యల సాగు లాభాలు పండిస్తుందనుకుంటే వైట్ స్పాట్, వైట్ గట్ వ్యాధులు అశనిపాతంలా తగిలాయి . ఇటీవల చోటుచేసుకున్న వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలి రాష్ట్రంలో 5 జిల్లాల్లో రూ. 50 కోట్లకు పైగా రొయ్య రైతుకు నష్టం కలిగింది. అసలే గిట్టుబాటు ధరలేని స్ధితిలో వ్యాధులు కూడా విజృంభించడంతో రైతు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు.
వ్యాధులతో రొయ్య విలవిల:
వెనామీ రొయ్యల పై ప్రధానంగా వైట్ స్పాట్, వైట్ గట్ వ్యాధులు, రన్నింగ్ మోరాల్టిటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. సిండ్రోమ్ వైరస్ కారణంగా వచ్చే వైట్ స్పాట్ వ్యాధి సోకిన రొయ్యల తలభాగం , తోక , శరీరం పై తెల్లని మచ్చలు ఏర్పడూతున్నాయి. వైట్ గట్ లో తెల్లటి దారం మాదిరిగా రొయ్యలలో ఉంటూ వాటి మరణాలకు కారణమవుతోంది.ఈ వ్యాధుల నివారణకు మందులులేవు . కృష్టా జిల్లా, కలిదిండిమండలం కొండూరు గ్రామంలో రెండు రోజుల క్రితం వైట్ స్పాట్ సోకి 20 ఎకరాల్లో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ఇటీవల 43 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్టోగ్రత ప్రస్తుతం 32 డిగ్రీలకు తగ్గడం కూడా వ్యాధులు ప్రబలడానికి కారణమైంది.ప్రవైట్ హెచరీల నుంచి నాణ్యమైన సీడ్ రాకపోవడంతో రైతులు మోసపోతున్నారు.
Source: sakshi