రొయ్యల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, సరైన మెలకువలు పాటించకపోవటంతో రైతులు మొదట్లోనే నష్టాల బారిన పడుతున్నారు. ఆక్వాసాగు చేస్తున్న చెరువుల్లో సుమారు నెలరోజుల లోపే వైరస్ వ్యాధులు సోకి రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. రొయ్యలను పట్టిన తరువాత చెరువులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి నెలరోజుల పాటు ఎండబెట్టాలి. ఆసమయంలో బ్లీచింగ్, బ్యాక్టీరియా నివాణకు మందులను చల్లాల్సి ఉంది. అయితే చెరువులోని రొయ్యలను పట్టిన తరువాత ఈజాగ్రత్తలు పాటించకుండానే తిరిగి రొయ్య పిల్లలను వేసి సాగుకు సిద్ధమవుతుండటంతో వైరస్ వ్యాధులు సోకుతున్నాయి.
సాగు చేయాలనే ఆదుర్దాతో, పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా, పూర్తిస్థాయిలో నియమాలు పాటించకుండా చేస్తున్న సాగు నష్టాలనే తెచ్చిపెడుతున్నది. రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించి సాగును చేపడితే తప్పనిసరిగా ఆక్వా ఆశాజనకంగా ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలుపుతున్నారు. తాము ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి సాగును చేపట్టాలని కోరుతున్నారు.
మత్స్యశాఖ అధికారులు సూచనలు ఇవీ..
నీటి గుణాలు ఎప్పకప్పుడు పరీక్షించుకోవాలి. డి.ఒ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పరిశీలించాలి. వారానికి ఒకసారి నీటి పీ.హెచ్, ఆల్సలినీటి, విషవాయువులైన అమ్మోనియా, నైట్రేట్, హైడ్రోజన్‌సలై్ఫడ్ వంటివి పరీక్షించుకోవాలి. వెనామి సాగులో నిరంతరం ఏరియేటర్లు వాడుకోవాలి. ప్రతి 300 కేజీల రొయ్యలకు ఒక హెచ్‌పీ ఏరియేటర్ అవసరం.
బయో సెక్యూరిటీ..
చెరువు ప్రవేశ ద్వారం వద్ద చేతులు, కాళ్లు కడుగుకొనేందుకు వీలుగా పొటాషియం పెర్మాంగ్‌నేట్ ద్రావణం ఉంచాలి.
చెరువు గట్ల వెంబడి పీతలు వంటి వైరెస్ వాహకాల ప్రవేశాన్ని నిరోధించేందుకు వీలుగా ఆరమీటరు ఎత్తులో వల (క్రాబ్‌ఫెన్సింగ్) ఏర్పాటు చేయాలి.
ప్రతి చెరువుకు వేర్వేరు పనిముట్లు(వలలు,మగ్గు వంటివి) వాడుకోవాలి.
శుభ్ర పరిచే వ్యవస్థ తప్పనిసరి..
సాగు తొలిదశ నుంచి ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. చెరువులో రొయ్యపిల్లల్ని వదలడం, చెరువులో నీటిని పెట్టుకుని తక్కువ మోతాదులో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడుకోవాలి. రొయ్యపిల్లల నాణ్యత, ఒత్తిడి పరీక్షలు చేసుకుని పి.ఎల్ 10 నుంచి 12 రోజులు ఉన్నవాటిని చదరపు మీటరుకు 60 పిల్లలకు మించకుండా విడుదల చేయాలి. Source : Sakshi