నకిలీ హేచరీలు రొయ్య రైతులను త్రీవంగా దెబ్బతీస్తున్నాయి. దీనిని అరికట్టాల్సిన అధికార గణం నోరెత్తకపోవడంతో రూ.కోట్లు పెట్టుబడులు పెట్టిన రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. తాజాగా యాంటిబయోటిక్స్ వాడిన రొయ్యలను కొనుగోలు చేయబోమని రొయ్య ఎగుమతిదారుల జాతీయ సంఘం నిర్ణయించడంతో సాగుదారులు ఏం చేయాలో దిక్కుతోచని స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే...
రాష్ట్రంలో తీరప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం , తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్టా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా ఆక్వా సాగు చేపడుతున్నారు. ఒక రూపాయి పోయినా మరోసారి మిగులుతుందనే ఆశతో ఈ రంగంలోకి వస్తున్నవారే అధికం. రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఎకరాలు వరకూ రొయ్య సాగుచేపడుతున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం కాస్త అటు ఇటుగా సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఆదాయం కూడా సుమారు రూ. 20 వేల కోట్ల వరకూ లభిస్తోంది. ఇంతటి భారీ ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నా కూడా అనధికారక హేచరీలు రొయ్య రైతులను నిలువునా ముంచేస్తున్నా సహేతుక చర్యలు చేపట్టకపోవడం రాష్ట్రవ్యాప్తంగా 250 వరకూ హేచరీలు ఉండగా వీటిలో అధికారికంగా గుర్తింపు పొందినవి కేవలం వందలోపు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 150 హేచరీలు కూడా అనధికారికంగా నిర్వహిస్తున్నవే .రొయ్య రైతు లాభ, నష్టాలను తొలిదశలో హేచరీలే నిర్ణయిస్తాయి. హేచరీల వద్ద పిల్లలను రైతులు కొనుగోలు చేస్తుంటారు. నిబంధనల ప్రకారం రొయ్యపిల్లలను గుర్తింపు పొందిన హేచరీలే అమ్మాలి. చెన్నైలోని కోస్టల్ ఆక్వాకల్చర్ అధారిటీ ద్వారా గుర్తింపు పొందిన హేచరీల్లో ఈ రొయ్య పిల్లలు లభిస్తాయి. అమెరికా , ఇతర దేశాల్లోతయారైన తల్లి రొయ్యలను కొనుగోలు చేసి చెన్నైలోని రొయ్యపిల్లల అభివృద్ది ,సంరక్షణ కేంద్రాల నిర్వహకులు పిల్ల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఎటువంటి యాంటిబయోటిక్స్ వాడకం ఉండదు.ఈ పిల్లలను అనుమతి పొందిన హేచరీలు నిర్వాహకులు కొనుగోలు చేసి కొంత లాభం వేసుకుని రొయ్య రైతులకు అమ్ముతుంటారు. ఇలా అధికారంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తయారైన రొయ్యపిల్లలకు ఎటువంటి యాంటీబయోటిక్స్ వాడరు. ఇటువంటి రొయ్య పిల్లల వల్ల భవిష్యత్తులో కూడా సమస్యలు ఉండవు. కౌంటు కూడా బాగా పెరుగుతుంది. అనధికారిక హేచరీల నిర్వహకులు వివిధ వ్యక్తుల వద్ద తల్లి రొయ్య పిల్లలను కొనుగోలుచేసి వాటిని తమ హేచరీల్లో పెంచి యాంటీబయోటిక్స్ ఇచ్చి అమ్మకం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఇటువంటి నకిలీ హేచరీలు ఉన్నాయి.వీటితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇలా అనధికారిక రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నిర్వహిస్తున్న వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు.
ఎగుమతులు నిరాకరిస్తే భారీ నష్టం:
రాష్ట్రంలో ఆక్వా సాగు అంటే రొయ్య సాగులో 50 శాతం పశ్చిమ గోదావరి లోనే సాగవుతోంది. సుమారు 70 వేల ఎకరాల్లో ప్రస్తుతం రొయ్యసాగు చేపట్టారు. ఎకరానికి పంట చేతికి వచ్చేటప్పటికి రూ.6 లక్షల వరకూ పెట్టుబడి అవుతుంది. ప్రస్తుత్తం పంట వేసి నెలన్నర రోజులు కావస్తుంది. ఇప్పటికే సుమారు ఎకరాకు రూ. 2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు .సుమారు రూ.1400 కోట్ల వరకూ ఈ పంటపై ఇప్పటికే పెట్టుబడిగా వెచ్చించారు. వీరిలో అనధికారిక హేచరీల వద్ద పిల్లలను కొనుగోలు చేసినవారూ ఉన్నారు. ఇప్పుడు యాంటీబయోటిక్స్ వాడకం వున్న రొయ్యలను తాము కొనుగోలు చేయబోమని చెప్పి కొనుగోళ్లు నిలుపుదల చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల రొయ్యలకు తెల్లమచ్చ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీని వల్ల రొయ్యలు భారీగా చనిపోతున్నాయి. పెరిగాకా కొనుగోళ్లు జరగకపోతే రెండో రకంగా నష్టం ఏర్పడుతుందంటున్నారు. వీటిని అరికట్టాలంటే నకిలీ హేచరీల అరికట్టాలని రైతులుకోరుతున్నారు. యాంటీబయోటిక్స్ వాడకం ఉంటే ఎగుమతులు నిరాకరణకు గురవుతున్నాయని దీని వల్ల తాము భారీగా నష్టపొతున్నామని ఎగుమతిదారులూ పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో సుమారు 40 నుంచి 50 వరకూ కంటైనర్లు వెనక్కి వచ్చాయంటున్నారు.దీంతో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతో తాము యాంటీబయోటిక్స్ వాడకం వున్న రొయ్యలను కొనుగోలు చేయడం మానుకున్నామంటున్నారు. పరిస్ధితి తీవ్రత నేపధ్యంలో అధికారులు కలగజేసుకోని నకిలీ హేచరీలపై ఉక్కుపాదం మోపితే రాబోయే సిజన్ లోనైనా ఈ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని రైతులు,రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
source: ఈనాడు