ఆక్వా ల్యాబ్ భద్రమేనా?
ఆక్వా రైతుల భవిష్యత్తు ల్యాబ్పైనే ఆధార పడి ఉంది. సాగులో ఏ సమస్య తలెత్తినా ల్యాబ్క పరుగులు తీయాల్సిందే. మట్టి నమూనాల నుంచి నీరు, రొయ్య పిల్ల వరకు తప్పనిసరిగా పరీక్షలు చేయించాల్సిందే.
కలిదిండి, న్యూస్టుడే: ఆక్వా రైతుల భవిష్యత్తు ల్యాబ్పైనే ఆధార పడి ఉంది. సాగులో ఏ సమస్య తలెత్తినా ల్యాబు పరుగులు తీయాల్సిందే. మట్టి నమూనాల నుంచి నీరు, రొయ్య పిల్ల వరకు తప్పనిసరిగా పరీక్షలు చేయించాల్సిందే. రొయ్యలు వేగంగా ఈదినా.. మందంగా ఉన్నా పరీక్ష చేయించక తప్పదు. ఇంకేవిధమైన వ్యాధులు సోకినా నిర్ధారణకు పరీక్షించాల్సిందే. అంతటి ప్రాధాన్యం ఉన్న అక్వా ల్యాబ్ నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ పక్కాగా ఉండాలి. లేదంటే.. లెక్కించడానికి వీలుకానంత నష్టం రైతులు మోయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ల్యాబ్లు '6'.. ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో అక్వా సాగవుతోంది. వీటిలో చేపలు 1.80లక్షలు, రొయ్యలు 1.10లక్షల ఎకరాల్లోనూ పండిస్తున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న రంగానికి తగినంతగా ల్యాబ్లు లేవు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ల్యాబ్లు ఆరు మాత్రమే ఉన్నాయి. ఏలూరు, భీమడోలు, కైకలూరు, భీమవరం, ఆకివీడు, నర్సాపురంలలో ప్రభుత్వ ల్యాబ్లు ఉన్నాయి. రైతుల అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవు. దీంతో ప్రైవేటు ల్యాబ్లపైనే ఆధార పడాల్సిన పరిస్థితి సాగుదారులకు ఏర్పడింది.
ప్రైవేటు ల్యాబ్లు '102'.. ఏలూరు జిల్లాలో 39, పశ్చిమగోదావరి జిల్లాలో 63 గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబ్ లు ఉన్నాయి. నీటి పరీక్షలు, మట్టి పరీక్షలు, పీసీఆర్ (రొయ్య పిల్లకు), మైక్రోబయాలజీ పరీక్షలకు ప్రైవేటుపైనే ఆధారపడాల్సి వస్తోంది. ల్యాబ్ నిర్వహణకు డ్రెయినేజీ సదుపాయం, బయో సెక్యూరిటీ చర్యలు, వ్యర్థాల నిర్వహణ సౌకర్యం, విద్యుత్తు, అగ్ని భద్రతకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. వీటి నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్హతలు లేని సిబ్బందితో పరీక్షలు చేయిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
తనిఖీలు చేస్తాం..
- రాజ్కుమార్, మత్స్యశాఖ ఏడీ
ల్యాబ్ లైసెన్సు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. నిబంధనలన్నీ అనుసరిస్తేనే దరఖాస్తు చేయడం సాధ్యమవుతుంది. ఆ సమయంలో మత్స్యశాఖ నుంచి అన్ని పత్రాలతో పాటు ల్యాబ్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన తరవాతనే లైసెన్సు మంజూరు చేస్తాం. సిబ్బంది అర్హతలకు సంబంధించి ఆకస్మిక తరచూ తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.