అమెరికా మార్కెట్లో భారత రొయ్యకు సవాలు
ఎగుమతులు 7-9% తగ్గే అవకాశం వెల్లడించిన క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ న్యూ ఢిల్లీ: ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో భారత రొయ్యల పరిశ్రమ అమెరికా మార్కెట్లో పెను సవాళ్లను ఎదుర్కోనుంది.. ఎగుమతుల్లో 7- 9% తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ సంస్థ సీనియర్ డైరెక్టర్ రాహుల్ గుహా ఆదివారం వెల్లడించారు. కొత్త సుకాంలతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. అమెరికా మార్కెట్లో భారత రొయ్యల
ఎగుమతులు సుమారు 48% వాటా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ||60,523.89 కోట్ల విలువైన 17,81,602 మెట్రిక్ టన్నుల సీఫుడ్స్ను ఎగుమతి చేసింది. అయితే కొత్త సుంకాలు, ఇప్పటికే ఉన్న వాటితో కలుపుకుంటే దేశాలకన్నా భారత్పైనే సుంకాలు అత్యదికం. ప్రపంచంలో రొయ్యల ఎగుమతి చేసే దేశాల్లో ఈక్విడార్ అగ్రస్థానంలో ఉంది. ఆదేశంపై అమెరికా విధించిన సుంకం కేవలం 10% మాత్రమే. దీనికి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ పన్ను కలుపుకున్నా నామమాత్రమే. దీంతో ఆదేశ రొయ్యలు చాలా తక్కువ ధరలకు లభించనున్నాయి. ఈక్విడార్ పోటీ కారణంగా భారత్ పై విధించిన 25% సుంకాలు, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ( సివిడి-5.77%), యాంటీ డంపింగ్ డ్యూటీ ( ఎడిడి-3.88%)తో కలుపుకుని ధరలు భారీగా పెరగనున్నాయని. దీని ప్రభావం భారత మార్కెట్పై గణనీయంగా ఉంటుందని, ఆదాయం 50-100 బేసిక్ పాయింట్లు తగ్గనుందని రాహుల్ వివరించారు. మరోవైపు మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పర్ట్ డెవలెప్మెంట్ అథారిటీ ( ఎంపిఇడిఎ), వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు రొయ్యల ఎగుమతుల పెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు ఆశాజనకంగా లేవు. ఏప్రెల్ నెలలో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తునట్లు ప్రకటించిన ఏపి ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెని ( ఎపిపిపిసి ) అతీగతీ లేదు. ఆంధ్రాలో దాదాపు 1.5 లక్షల రైతులున్నారు. ఆక్వా అనుభంద పరిశ్రమల్లో లక్షలాది మంది ఉపాధి పోందుతున్నారు. ప్రభుత్వం ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు ప్రత్యామ్నాయ మార్కెట్లను చూపాలని. రైతులకు నష్టాలను తగ్గించేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని, వేల కోట్ల టర్నోవర్ కలిగిన ఆక్వా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు..