విజయవాడ: ఫిషరీష్, అక్వారంగంలో మౌలిక సదుపాయాలు పెరగాల్సిన అవసరముందని వ్యవసాయ,
పశు సంవర్థక, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. మత్స్యరంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చుకోవడం కీలకమన్నారు. విజయవాడలో ఫిషరీస్, ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజశేఖర్ మాట్లాడుతూ... రాష్ట్రానికి గుడ్లు, మాంసం ద్వారా 12 శాతం జీఎస్ఓపీ లభిస్తోందని, మత్స్యసంపద ద్వారా 11 శాతం జీఎస్ డీపీ వస్తోందని వివరించారు.
ఏపీలో 1028 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండగా, మెరైన్ ఉత్పత్తులు మాత్రం 10 శాతమేనని చెప్పారు. ఈ రంగంలో ఉత్పత్తులు గణనీయంగా పెరగాలని, ఫిషరీస్, ఆక్వాలో 30 శాతం వరకు వృద్ధిరేటు పెరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాజశేఖర్ చెప్పారు. ఆక్వా రంగంలోనూ రైతు ఉత్పత్తి సమాఖ్యలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో కోల్డ్ చైన్ పాలసీని విడుదల చేయనున్నామని చెప్పారు. మత్స్య, ఆక్వాకల్చర్లో మౌలిక సదుపాయాల కల్పనకు రుణ అవకాశాలపై వర్క్ షాప్లో చర్చించారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఎబీ ద్వారా రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని రాజశేఖర్ పిలుపునిచ్చారు. నరసాపురంలో ఉన్న ఫిషరీ యూనివర్సిటీని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజశేఖర్ హామీ ఇచ్చారు.