రొయ్య అ'ధర ' హా
కలిదిండి, న్యూస్టుడే: 'అయిదు ఎకరాల్లో రొయ్యలు పండిస్తున్నా.. వాతావరణ మార్పులతో పది రోజుల కిందట ఆకస్మికంగా పట్టుబడి చేసేశా.. రూ.7.50 లక్షల నష్టం వాటిల్లింది. ఈ రోజు ఉన్న ధర ఆ రోజు ఉంటే లాభాలతో బయట పడేవాణ్ని' అని ప్రొద్దువాకకు చెందిన ఓ రొయ్యల రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
దిగుబడులు బాగున్నప్పుడు ధరలు పతనం అవుతున్నాయి. చెరువులు ఖాళీ అయ్యాక ధరలు పైపైకి ఎగసిపడుతున్నాయి. ఇదీ.. రొయ్య రైతుల దయనీయ పరిస్థితి. రెండు నెలలుగా వ్యాధుల ఉద్ధృతితో ఉమ్మడి జిల్లాలో 80 శాతం చెరువుల్లో పట్టుబడులు చేసేశారు. ఈ నేపధ్యంలో ధరలు పెరగడంతో రైతులు ఉసూరుమంటున్నారు.
నష్టాల బాట..
ఈ ఏడాది జూన్ తొలి వారంలో 100 కౌంటు కిలో ధర రూ.225 ఉంది. మూడో వారంలో రూ.215కి పడిపోయింది. జులై తొలివారం నుంచి ధర క్రమంగా పుంజుకుంటూ 20వ తేదీకి రూ.250కి చేరింది. రూ.210-20 ధరల్లో పట్టుబడి చేసిన రైతులంతా తీవ్ర నష్టాలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలు చూసి ఆవేదనకు గురవుతున్నారు.
సాగుపై సందిగ్ధం..
ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రొయ్యల సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలోకి సాగుదారులు వెళ్లి పోతున్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో సింహభాగం సమకూర్చి పెట్టే ఆక్వా రంగంపై ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాలనే భావన రైతుల్లో కనిపిస్తోంది. రొయ్య పిల్ల హేచరీల ఏర్పాటు, మందులు, మేతల ధరల నియంత్రణ, ధరల స్థిరీకరణ, శీతల గిడ్డంగుల ఏర్పాటు వంటి వాటిపై గట్టి చర్యలు తీసుకుంటేనే సాగు మనుగడ సాధ్యమవుతుందని రైతులు పేర్కొంటున్నారు.