ఆశల 'ధర 'హాసం
కలిదిండి, న్యూస్టుడే: రొయ్యల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సాగుదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ తొలివారం నుంచి జూన్ నెలాఖరు వరకు 100 కౌంటు కిలో ధర కేవలం రూ.210-230 మధ్యలోనే ఉండటంతో రైతులు భారీగా నష్టపోయారు. దీంతో ఆగస్టు పంటపై సందిగ్ధంలో పడ్డారు. 15 రోజులుగా 100 కౌంటు కిలో ధర రూ. 255 పై నిలకడగా ఉండటంతో ఖాళీ అయిన చెరువులను సాగుకు సిద్ధం చేస్తున్నారు.
పదిహేను ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నా.. ధరల పతనం, ఆకాల వర్షాలు, వ్యాధులు కారణంగా రూ.18 లక్షలు నష్ట పోయా. ఈసారి పంట వేయకూడదని నిర్ణయించుకున్నా. 15 రోజులుగా ధరలు నిలకడగా ఉండటంతో సాగుకు సన్నద్ధమవుతున్నా' అని చెబుతున్నారు కలిదిండికి చెందిన రొయ్యల రైతు రాజా.
నిలకడగా ధర.. ఆక్వాలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా 'ధర' ఆశాజనంగా ఉంటే.. సాగు చేయడానికి రైతులు ఏమాత్రం సంకోచించరు. ఎప్పుడైతే ధరల పతనం వెంటాడుతుందో.. పెట్టుబడులు మట్టిలో కలిసి పోయినట్లే. నాలుగు నెలల తర్వాత 100 కౌంటు కిలో ధర రొయ్యల రూ.255కి చేరడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
సాగుకు సన్నద్ధం.. ఉమ్మడి జిల్లాలోని 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. దీనిలో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు పండిస్తున్నారు. ప్రస్తుతం 90 వేల ఎకరాలు ఖాళీ అయిపోయాయి. ఆగస్టు నుంచి పంట కాలం ప్రారంభం కానున్న నేపధ్యంలో సాగుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ ధరలు నిలకడగా కొనసాగితే గతం తాలూకూ నష్టాలు పూడ్చుకోవచ్చని రైతులు భావిస్తున్నారు.