రొయ్యకు మళ్లీ సుంకాల దెబ్బ
సిరుల పంటగా పేరొందిన రొయ్యల సాగుకు అమెరికా సుంకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు అమలు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలపై వేటు పడింది. ఆ సమయంలో వంద కౌంట్ ధర రూ.200కు పడిపోయింది. అదే సమయంలో సుంకాల అమలును మూడు నెలల పాటు వాయిదా వేయడంతో కొంతమేర ఆక్వా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి వంద కౌంట్ రూ.260కు చేరింది. ప్రస్తుతం ఈ నెల 1 నుంచి 25 శాతం మేర సుంకాలు వడ్డిస్తామని ప్రకటించడంతో ఆక్వా రైతుల్లో మళ్లీ అలజడి మొదలైంది.
ఉమ్మడి జిల్లాలో 85వేల ఎకరాల్లో సాగు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపలు, రొయ్యలు 2.80 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీనిలో 80 వేల ఎకరాల్లో రొయ్య పంట సాగులో ఉంది. అధికంగా కోనసీమ జిల్లాలో 45 వేల ఎకరాల వరకు సాగులో ఉండగా, మిగిలిన భాగం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉంది. మరో మూడు నెలల్లో పంట చేతికి..
మరో రెండు మూడు నెలల్లో రైతుల వద్ద పంట ఉంటుంది. అటువంటి తరుణంలో తాజా అమెరికా సుంకాల దెబ్బ ఎంతవరకు ఉంటుందనే ఆవేదన రైతుల్లో ఉంది. మార్చి నెలలో రోజుకు రూ.10ల చొప్పున ధర పడిపోవడంతో రైతులు మానసిక ఆవేదనకు గురయ్యారు. ప్రస్తుతం వంద కౌంట్ రూ.240ల వరకు కొంటున్నారు. రైతుల వద్ద పంట చేతికి వచ్చే సమయంలో సుంకాలు అమలు చేస్తే తిరిగి గతంలో మాదిరిగానే వంద కౌంట్ ధర రూ.200లకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు, ట్రేడ్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.